- ప్రతి బస్తా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- రైతుల సంతోషమే కూటమి ప్రభుత్వము ముఖ్య ఉద్దేశ్యం
- పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
వెంకటగిరి (చైతన్యరథం): ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పండిరచిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులకు చోటు లేదన్నారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యాతలూరు గ్రామంలో పౌరసరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లపై రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలోనే 74 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.154 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్యేయం అన్నారు. జిల్లాలో 134 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించకుండా పెండిరగ్ పెట్టిన 1674 కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించదని తెలిపారు. రైతుల అనుభవాలను, వారి కష్టాలను తెలుసుకొనడానికి యాతలూరు గ్రామానికి వచ్చానన్నారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాట్సప్ ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతులకు నచ్చిన రైసుమిల్లులకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చునన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారన్నారు. అయితే 24 గంటల్లోనే 90 శాతం మంది రైతులకు నగదు జమవుతోందని తెలిపారు. రైతు నుంచి ప్రతి బస్తాని కొనుగోలు చేస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. 17 శాతం తేమ ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గోతాల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జిల్లాకు ఐదు లక్షల గోతాలను అందజేశామన్నారు. రైతుల ఆవేదనను అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల బాధలు తెలుసుకొని ధైర్యం చెప్పాలన్నారు. పండిరచిన ధాన్యాన్ని ఎప్పుడు తీసుకొచ్చినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందజేస్తామన్నారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం అమ్మగానే.. అమ్మినట్లుగా, డబ్బులు పడినట్లుగా, మీరు సంతోషంగా ఉన్నారా.. ఫోన్ కు మెసేజ్ లు వస్తున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు వస్తున్నాయని, గతంలో మిల్లర్ల వద్ద నాలుగైదు రోజులు పడిగాపులు కాచేవారమని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు గంటల లోపల మిల్లర్లకు అప్పజెప్పి సంతోషంగా వస్తున్నారని మంత్రికి రైతులు వివరించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచాలమ్మ, డీసీఓ లక్ష్మి, సివిల్ సప్లైస్ డీఎం సుమతి, మండల తహశీల్దార్, ఎంపీడీఏ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.