- అనర్హత వేటు భయంతోనే
- ఉప ఎన్నికలు వస్తే పులివెందుల కూడా కష్టమని తెలిసే
అమరావతి (చైతన్యరథం): ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అనర్హత భయంతో వెనుకడుగు వేశారు. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. అనర్హత వేటు పడుతుందనే భయంతోనే జగన్ సభకు వస్తున్నారనేది వాస్తవం. వరుసగా 60 పనిదినాలు శాసనసభకు హాజరుకాకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దువుతుంది. ఈ క్రమంలో అసెంబ్లీ నిబంధనల ప్రకారం వరుసగా అరవై రోజులు ఏ కారణం లేకుండా, సమాచారం ఇవ్వకుండా నిరవధికంగా సభకు గైర్హాజరు అయితే సభ్యుల సభ్యత్వం రద్దవుతుందని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధికారికంగానే స్పష్టం చేశారు. మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యేలతోపాటు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన కేవలం హాజరు కోసమే మొక్కుబడిగా వెళుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక రోజు వెళితే మళ్ల్లీ 60 రోజుల వరకు వెళ్లనవసరం లేదు. ఈ క్రమంలో ఒక రోజు వెళ్లి పబ్బం గడుకుని వచ్చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి 11 సీట్లు లభించిన విషయం తెలిసిందే. దానివల్ల ప్రతిపక్ష హోదాను జగన్ కోల్పోయారు. అయినా, విపక్ష హోదా కోసం ఇన్నాళ్లుగా ఆయన వాదిస్తూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లడంలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై సంధించే ప్రశ్నలకు .. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పాలని ఇటీవల జగన్ పిడివాదన చేశారు. శాసనసభకు హాజరుకాకపోతే .. సభ్యత్వం రద్దయితే .. ఉప ఎన్నికలను ఎదుర్కోనాల్సి వస్తుందని భయపడ్డ జగన్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. జగన్ మొండిగా శాసనసభకు హాజరవకుండా ఉన్నప్పటికీ, ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పదవులు కాపాడుకునేందుకు శాసనసభకు వెళ్తే జగన్ పరువు పోతుంది.
వారు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. జగన్‌తో పాటు ఆయనని నమ్ముకున్నందుకు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వకపోయనా, సభలో తలదించుకోవాల్సి వచ్చినా, జనం నవ్వుకున్నా, కనీసం ఎమ్మెల్యే పదవిని, 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుందామనుకుంటూ గత్యంతరంలేక జగన్ శాసనసభకు వస్తున్నారనుకోవచ్చు.
అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఒక్క రోజయినా అసెంబ్లీకి వెళ్లడం అంటే.. పిరికితనానికి, పనికి మాలిన రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం. అయినా ఇప్పుడు తగ్గకపోతే రేపు తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సున్నా అవుతుంది. చివరికి పులివెందులలో తాను కూడా నెగ్గడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. అందుకే ఎవరేమనుకున్నా తనపై .. తన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకోవటమే ముఖ్యమని జగన్ అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచినవారిలో పలువురు స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపఎన్నికలు వస్తే వారెవరూ గెలవలేరు. అంతెందుకు.. జగన్ తన నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోవడం కష్టం. ఉపఎన్నికలు అంటూ వస్తే తన పార్టీ జీరో అవుతుంది కాబట్టి ఆయన .. కాళ్ల బేరానికి వచ్చేస్తున్నారు.