ఏపీ వృద్ధిరేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.. 2024-25 సంవత్సరానికి గాను మన రాష్ట్రం దేశంలోనే రెండవ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రం 8.21 శాతం వృద్ధిని సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే మన విధానాలు ఆంధ్రప్రదేశ్‌ను సంక్షోభం నుంచి వృద్ధి పథంలోకి తీసుకెళ్లాయి. రాష్ట్రాన్ని నూతన విశ్వాసంతో ముందుకు నడిపించాయి. వ్యవసాయం, తయారీ, సేవల రంగాల్లో విస్తృత పునరుజ్జీవనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు ఈ ప్రగతికి చోదకాలుగా నిలిచాయి. గ్రోత్ రేట్ వృద్ధి పెరగడం రాష్ట్ర ప్రజల సమష్టి విజయం అంటూ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మనం కలసికట్టుగా కృషి చేసి మరింత ఉజ్వలమైన బంగారు భవిష్యత్తును నిర్మించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు జాతీయ మీడియాలో ఏపీ ఘనతపై వచ్చిన కథనాల క్లిప్పింగ్‌ల ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో పంచుకున్నారు.