అమరావతి (చైతన్యరథం): ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్లను నిర్వచిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గురువారం ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిజర్వేషన్ నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీని ప్రకారం.. మొదటి గ్రూప్‌లో ఉన్న రెల్లి సహా 12 ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. రెండో గ్రూప్‌లో ఉన్న మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5 శాతం రిజర్వేషన్, మూడో గ్రూప్‌లో ఉన్న మాల సహా 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణ కింద మొత్తం 15 శాతం రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. మొత్తం 200 రోస్టర్ పాయింట్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మూడు కేటగిరిల్లోనూ మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ అర్హులు లేకుంటే తదుపరి నోటిఫికేషన్కు ఖాళీలను బదలాయిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.