- విధివిధానాలు ఖరారు
- జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి ఉచిత ఇసుక విధానం
- ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మార్గదర్శకాలు
- కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటు
- ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక
అమరావతి(చైతన్యరథం): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత ఇసుకపై విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో నెం 43 విడుదల చేసింది. 2024` కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమల్లో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్టాక్ పాయింట్లలో ఇప్పటికే నిల్వ ఉన్న ఇసుకను వినియోగదారులకు అందించనున్నారు. ఈ విధానంలో వినియోగదారులు ఇసుక కోసం ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. లోడిరగ్, రవాణా చార్జీలు, స్వల్పమొత్తంలో నిర్వహణ ఖర్చులు, స్థానిక పన్నుల వరకు భరించాల్సి ఉంటుంది. రవాణా ఛార్జీలు వినియోగదారులు ఎంపిక చేసుకున్న వాహనం, దూరాన్నిబట్టి ఉంటాయి.
వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లా ఇసుక కమిటీల్లో ఆయా జిల్లాల ఎస్పీలు, జేసీలు సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉందని ప్రభుత్వం పేర్కొంది.
డిజిటల్ విధానంలోనే చెల్లింపులు
రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడిరగ్, రవాణా ఛార్జీలను నిర్దారించే బాధ్యతను కూడా జిల్లా కమిటీకి అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడిరగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొనుగోలుదారులు తీసుకున్న ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణాలు మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా జరిమానాలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
కార్మికుల హర్షం
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో సోమవారమే లారీలు, ట్రాక్టర్లు ఇసుక రీచ్‌లకు క్యూ కట్టాయి. వ్యాపారులు, కొనుగోలుదారులతో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద కోలాహలం నెలకొంది. చాలా జిల్లాల్లో ఉచిత ఇసుక సరఫరాను మంత్రులు ప్రారంభించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా 125 వరకు చేతివృత్తులకు ఊతం లభిస్తుంది. కార్మికులకు ఉపాధి లభించడంతోపాటు భవన నిర్మాణ రంగం పుంజుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ రంగం పూర్వవైభవం సంతరించుకుంటుందని, చేతినిండా పని దొరుకుతుందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకుంటున్నారు.
భవననిర్మాణ రంగానికి ఊపిరి
ఏపీలో భవన నిర్మాణ రంగానికి ఊపిరి పోస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూటమి సర్కారు వచ్చిన వెంటనే రాష్ట్రంలో కీలక పథకాల విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరంలో పర్యటించిన చంద్రబాబు, ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏర్పడిన సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించే దిశగా అడుగులు వేశారు. తర్వాత జగన్ పాలనతో విధ్వంసానికి గురైన రాజధాని అమరావతిపై దృష్టి సారించారు. రాజధాని నిర్మాణం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు సామాజిక పింఛన్‌ను రూ.1000 పెంచి, రూ.4000 చేశారు. దీనిని ఏప్రిల్ నుంచే అమలు చేస్తూ మూడు నెలల బకాయిలు కలిపి రూ.7000 మొత్తాన్ని అందచేశారు. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులకు 4వేల కోట్లకు పైగా అందజేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఉచితంగా ఇసుకను ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణరంగం పుంజుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
జగన్ జమానాలో అడ్డగోలు దోపిడీ
చంద్రబాబు హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలల పాటు ఇసుక అమ్మకాలు నిలిపివేసి 40 లక్షలకు పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. అంతేకాకుండా ప్రైవేటు కాంట్రాక్టులకు ఇసుక రీచ్‌లు అప్పజెప్పడం ద్వారా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. కోర్టులను తప్పుదారి పట్టించి పర్యావరణ అనుమతులు లేకుండా అడ్డగోలు తవ్వకాలతో జగన్ రెడ్డి ఇసుకలోనే దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా దోచుకున్నారు. అంతే కాకుండా ఇసుక ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. చంద్రబాబు హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1200 ఉండగా, జగన్ జమానాలో రూ.6 వేలకు అమ్ముకున్నారు. లారీ ఇసుక చంద్రబాబు హయాంలో రూ. 5 వేలు ఉండగా, జగన్ పాలనలో రూ. 24 వేల వరకు అమ్మి జనాన్ని దోచుకున్నారు.
దీంతో అత్యంత కీలకమైన భవన నిర్మాణ రంగం కుదేలైన విషయం తెలిసిందే. అదే విధంగా కార్మికులు రోడ్డున పడ్డారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయి అనేకమైన సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వినియోగదారులకు ఉచితంగా ఇసుకను అందించనున్నారు. కేవలం రవాణా, లోడిరగ్ చార్జీలు చెల్లిస్తే ఇసుకను ఉచితంగా ఇంటికి పంపించేలా మార్గదర్శకాలు జారీ చేశారు.