జనం కడుపుగొట్టి తన పొట్ట నింపుకోవడంలో చరిత్రకెక్కిన జగన్‌రెడ్డి అంతూ పొంతూలేని అత్యాశ యావద్భారతానికే తలవంపులు తెచ్చింది. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మాటున రూ.1750 కోట్లు మేతమేసిన జగత్ కంత్రి సాగించిన ముడుపుల బాగోతాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ వెలుగులోకి తెచ్చింది. అవినీతి గడ్డిమేసి అధిక ధరలకు అదానీ కరెంటు కొనుగోలుకు ఒప్పందం చేసుకొన్న జగన్‌రెడ్డి మూలంగా ప్రజల నడ్డి విరిగిన అదనపు భారం.. అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లు. ఆర్ధిక నేరాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుమోసిన జగన్‌మీద ఇప్పటికే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. రూ.43వేల కోట్ల అక్రమాస్తులను జగన్ పోగేశారని దర్యాప్తు సంస్థలే నిగ్గుతేల్చాయి. అయినా ఆ కేసులపై విచారణలే దశాబ్దకాలంగా దేకుతున్నాయి. ఇప్పుడు జగన్ ముడుపుల లోగుట్టును అమెరికా యంత్రాంగం రట్టుచేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం జగన్‌రెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలి. వైసీపీ హయాంలో కుదిరిన అన్ని ఒప్పందాలపై సమగ్ర విచారణ జరగాలి.
జ్యూడీషియల్ కమిషన్లను ఏర్పాటుచేసి జగత్‌కంత్రి వికృత అవినీతిని బట్టబయలు చేసి కఠినంగా శిక్షించాలి. అంతర్జాతీయ అవినీతి పరుడిగా చరిత్రకెక్కిన ఘనుడు జగన్‌రెడ్డి. భారీ లంచం భోంచేసి 25 ఏళ్లపాటు రాష్ట్ర ఖజానాకు బొర్రెపెట్టి అదానీకి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేయాలి. మోసానికి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీయం జగన్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజలూ కోరుతున్నారు. వ్యక్తిగత లాభం కోసం ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడిన ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే స్పష్టంచేసింది. లోతైన కుట్రలతో కూడిన ఆర్ధిక నేరాలు దేశార్ధికానికి ప్రమాదకరమైనవని, వాటిని తీవ్రంగా పరిగణించాలని జగన్మోహన్‌రెడ్డి కేసులోనే సుప్రీమ్ కోర్టు పదేళ్ల క్రితమే వ్యాఖ్యానించింది.
రద్దీగావున్న బస్సుల్లో కక్కుర్తిపడి ఒక జేబుదొంగ ఒకరి పర్సు కొట్టేస్తాడు. తోటి ప్రయాణికులకు ఆ విషయం తెలియగానే ఆగ్రహం వ్యక్తంచేస్తూ అతణ్ని పట్టుకుని చావబాది పోలీసులకు అప్పగిస్తారు. అట్లాగే దారిన వెళ్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును లాక్కునిపోతాడు మరొకడు. దొరికితే అతడిని పట్టుకుని కాళ్లూ చేతులు విరగ్గొట్టి పోలీస్ స్టేషన్‌కి ఈడ్చు కెళతారు. దర్యాప్తు వ్యవస్థలు కూడా ఇటువంటి జేబు దొంగలపైనే తమ వీర ప్రతాపం చూపిస్థాయి. కానీ ప్రజలకు అబద్దాలు చెబుతూ వారి డబ్బు వివిధ రూపాల్లో కోటానుకోట్లు దోచేస్తున్న నేతలను మాత్రం దండిరచడం వదిలేసి.. బందిపోటు దొంగలకు వంగివంగి దండాలు పెడుతూ పూలదండలు వేస్తున్నారు. అవినీతి అనేది తన జన్మహక్కుగా భావిస్తున్నారు జగన్‌రెడ్డి. అవినీతి ఆయనకీ అలవాటైపోయింది. అవినీతి ద్వారా అక్రమాస్తులు పోగేయడంలో ప్రపంచానికే ఆదర్శపురుషుడుగా వర్ధిల్లుతున్నాడు. అవినీతిద్వారా జనం సొమ్మును, జాతివనరులను గంపగుత్తగా దిగమింగి అరాయించుకోవడంలో జగన్‌రెడ్డి ఆయనకు ఆయనే సాటి. నేరమయ రాజకీయాల పుణ్యమా అని అవినీతి భారత గాథలో కళ్లు బైర్లుకమ్మించే అరాచక ఘట్టాలతో ప్రజాస్వామ్యం పుచ్చి పురుగులు పడి లుక లుక లాడుతున్నా ఎవరికీ పట్టడం లేదు.
సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్‌నుంచి అమెరికా వరకు చర్చ జరుగుతుంటే, కేసు నమోదై రచ్చవుతున్నా జగన్‌రెడ్డి మాత్రం ఇంకా బుకాయిస్తూ తన ముడుపుల బాగోతంపై పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా `సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధమంటూ జగన్‌రెడ్డి, ఆయన వంది మాగధులు అడ్డంగా వాదిస్తున్నారు. కానీ సౌర విద్యుత్తు కొనుగోలుపై అడ్డంగా దొరికిపోయినా నిజాలు దాచేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. జగన్‌రెడ్డి దీనికి ముందు సమాధానం చెప్పాలి. సెకీతో ఒప్పందానికి ముందు పనిగట్టుకుని ప్రత్యేక విమానంలో తాడేపల్లికి మూడుసార్లు అదానీవచ్చి తనని ఎందుకు కలిశారు? ఒకవేళ విద్యుత్తు ఒప్పందం కోసం కాదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ వచ్చారని అనుకున్నా.. ఆ విషయాన్ని జగన్ ఎందుకు బహిర్గతం చేయలేదు ఆనాడు? ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా పేరున్న అదానీ మూడు నెలల్లో మూడుసార్లు రహస్యంగా కలవాల్సిన అవసరమేమిటి? పంప్డ్ స్టోరేజీ, డేటా సెంటర్‌ను అదానీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆనాడు సీయం కార్యాలయం అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? ఆ భేటీల వెనుక మర్మమేంటి? అమెరికా దర్యాప్తు సంస్థలు ఆ సందేహాలను నివృత్తి చేస్తూ స్కాముల కోసం స్కీమ్‌లకు స్కెచ్‌వేసి రాష్ట్రంపై లక్షల కోట్ల రూపాయల సోలార్ ఒప్పంద భారాన్ని జగన్ వేశారంటూ న్యూయార్క్ కోర్టులో అభియోగం మోపింది. జగన్- అదానీ ముడుపుల వ్యవహారం, ఇది నచ్చక విద్యుత్ సరఫరా ఒప్పందం నుంచి అజూర్ వైదొలగడం గురించి అభియోగపత్రంలో పేర్కొన్నది. జగన్ ముడుపుల బాగోతం కళ్లకు కనిపిస్తున్నా అబద్దాలు చెప్పడం, బుకాయించడం జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
అదానీ గ్రూప్ ముట్టచెప్పిన ముడుపుల మొత్తం రూ 2,029 కోట్లలో మాజీ సీయం జగన్‌రెడ్డికే రూ.1,750 కోట్లు ముట్టినట్లు సమాచారం. జగత్ కంత్రి ప్రభుత్వం.. సెకీ ద్వారా 7వేల మెగావాట్ల అదానీ విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.25 లక్షల చొప్పున 7వేల మెగావాట్లకు రూ.1,750 కోట్లు ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయి. 2016లో అదానీ గ్రీన్‌కు ఒకే ఒక్క విద్యుదుత్పత్తి ప్లాంట్ వుండేది అదీ 20 మెగావాట్ల సామర్థ్యంతో ఉండేది. 2018నాటికి రెండువేల మెగావాట్ల సామర్థ్యానికి విస్తరించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుని అందుకు 2020లో సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్తు టెండరు తమకు దక్కిందని, 2025నాటికి 25వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని అదానీ గ్రీన్ సంస్థ 2020 జూన్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ సెకీకి టెండరు దక్కినప్పటికీ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాల డిస్కమ్‌లు ముందుకు రాకపోవడంతో అదానీపై ఒత్తిడి పెరిగి ఆయా రాష్ట్రాలకు ముడుపులు ఎరవేసింది. ఆ సమయంలోనే అప్పుడు సీయంగా వున్న జగన్‌రెడ్డిని అదానీ వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాతే ఏడువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదిరిందని అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడిరచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డికి రూ.1750 కోట్లు ముడుపులు ముట్టజెప్పడం ద్వారా అదానీ కంపెనీ లబ్దిపొందినట్టు అమెరికాలోని న్యూయార్క్ ఈస్ట్రన్ జిల్లా కోర్టులో కేసు నమోదు కావడమంటే జగన్‌రెడ్డి అవినీతి ఎంత తారాస్థాయికి చేరిందో ప్రజలు అర్ధం చేసుకోవాలి. క్విడ్ ప్రోకో పద్ధతిలో జగన్‌రెడ్డి ఆదానితో లాలూచీపడి పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అదానీకి అప్పనంగా కట్టబెట్టేందుకు జగన్‌రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకొన్నారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాల వల్ల డిసెంబర్ నుండి రాష్ట్ర ప్రజలు రూ.6072 కోట్ల విద్యుత్ భారాలు మోయాల్సిన పరిస్థితి దాపురించింది. మరో రూ.11,820 కోట్లను విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయాల్సిన పరిస్థితి. ఒకపక్క చార్జీలు, పన్నుల భారాలు ప్రజలు మోస్తుంటే, అవినీతికి పాల్పడి అదానికి దాసోహమైన జగన్‌రెడ్డి మరోవైపు విద్యుత్తు చార్జీలు పెంచుతున్నారని మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
జగన్‌రెడ్డి అవినీతి, అదానీ అత్యాశ ఆంధ్రప్రదేశ్ పరువు తీశాయి. జగన్‌రెడ్డి -అదానీ స్వార్ధ ప్రయోజనాలకు రాష్ట్రం ఆర్థికంగా బలైపోయే పరిస్థితి ఏర్పడిరది. అడ్డదారిలో అదానీకి మేలు చేయడానికి జగన్ సర్కారు అన్ని అడ్డదారులూ తొక్కింది. కేవలం అదానీకి మేలు చేసి తానూ ఆర్ధిక ప్రయోజనం పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) పిలిచిన 10,000 మెగావాట్ల టెండర్లను రద్దు చేసారు. రైతాంగానికి పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్తు సేకరించేందుకు ఏపీజీఈసీఎల్ 2021లో టెండర్లు పిలిచింది. యూనిట్‌ను రూ.2.49 ధరకు ఇచ్చేందుకు సోలార్ ఉత్పత్తి సంస్థలు ముందుకొచ్చాయి. అప్పట్లో దేశీయంగా సోలార్ విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.2.92గా ఉంది.
ఏపీజీఈసీఎల్ పిలిచిన టెండర్‌కు స్పందిస్తూ సోలార్ సంస్థలు యూనిట్‌ను రూ.2.49కు ఇస్తామనడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. జగన్‌కి చిత్తశుద్ధివుంటే వెంటనే కొనుగోలు ఒప్పందాలు చేసుకునే వారు. అలాకాకుండా అదానీకి దోచిపెట్టడానికి స్కెచ్ వేశారు. మేం సెకీతో ఒప్పందం చేసుకున్నాం. సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన ఎందుకు వస్తుందని జగన్ అమాయకంగా ప్రశ్నిస్తు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు. కావునా అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ సృష్టించిన అవినీతికి యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. స్వాహాపర్వాలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన జగన్‌రెడ్డిని చట్టబద్దంగా శిక్షించాలి. పాలకులం కాదు, సేవకులమంటూ నంగనాచి తనాన్ని అభినయించి లక్షల కోట్ల ప్రజాధనం బొక్కెందుకే అధికారాన్ని ఉపయోగించారు. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని తన రాజకీయ,ఆర్ధిక ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉపయోగించిన జగన్‌రెడ్డిపై సమగ్ర విచారణ జరిపించి, కఠినంగా శిక్షించాల్సి వుంది.
`నీరుకొండ ప్రసాద్